
మెదక్, 15 ఏప్రిల్ (హి.స.)నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలవాల్సిన కల్యాణలక్ష్మి పథకం గజ్వేల్ డివిజన్లో అడుగు ముందుకు పడటం లేదు. చెక్కులు సిద్ధంగా ఉన్నా, పంపిణీ చేసేందుకు ప్రోటోకాల్ అడ్డంకిగా మారడంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ నిలిచిపోవడంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. గతేడాది మంజూరైన దాదాపు 700 పైగా చెక్కులు గత ఆరు నెలలుగా డివిజన్ కార్యాలయంలోనే మూలుగుతున్నాయి.
ఆన్లైన్లో స్టేటస్ పరిశీలిస్తే చెక్కులు వచ్చినట్లు చూపిస్తున్నా, చేతికి అందకపోవడంతో లబ్ధిదారులు తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలో నెలకొన్న విలక్షణ రాజకీయ పరిస్థితులే ఈ జాప్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇక్కడి ఎమ్మెల్యేగా మాజీ సీఎం కేసీఆర్ (బీఆర్ఎస్), ఎంపీగా రఘునందన్ రావు (బీజేపీ) ఉండగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.
ప్రభుత్వ కార్యక్రమాలకు కేసీఆర్ హాజరుకాకపోవడం, కాంగ్రెస్ ఇన్చార్జి నేతలకు అధికారిక హోదా లేకపోవడంతో ప్రోటోకాల్ సమస్య తలెత్తింది. జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అపాయింట్మెంట్ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదు. వీఐపీలు వస్తేనే చెక్కులు పంపిణీ చేయాలన్న నిబంధనతో పేదల సొమ్ము పెండింగ్లో పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టర్ స్పందించి ఈ చెక్కులను పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్