సీఎం రేవంత్ రెడ్డి తో ముగిసిన మీనాక్షి, మహేష్కుమార్ భేటీ.. డీలిమిటేషన్ పై కీలక చర్చ
సీఎం రేవంత్ రెడ్డి తో ముగిసిన మీనాక్షి, మహేష్కుమార్ భేటీ.. డీలిమిటేషన్ పై కీలక చర్చ
Cm


హైదరాబాద్, 15 ఏప్రిల్ (హి.స.)

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్

దక్షిణాది రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం ఉదయం సమావేశమయ్యారు. మధ్యాహ్నం వరకూ ఈ భేటీ కొనసాగగా.. ప్రధానంగా నామినేటెడ్ పదవుల భర్తీ, నియోజకవర్గాల పునర్విభజన (Delimitation), పార్టీ అంతర్గత వ్యవహారాలపై కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా జరగనున్న నియోజకవర్గాల పునర్విభజన వల్ల తెలంగాణ వంటి రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం కలిగే అవకాశం ఉందన్న అంశంపై ప్రధానంగా చర్చించారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లను పెంచితే, అభివృద్ధి పథంలో ఉన్న తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, దీనిపై పార్టీ పరంగా చేపట్టాల్సిన పోరాటాలు, ప్రజా క్షేత్రంలోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. అలాగే.. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండేందుకు సీఎం ప్రతిపాదించిన 'హైబ్రిడ్ మోడల్' పై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

చాలా కాలంగా పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, ఎన్నికల సమయంలో చురుగ్గా పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించాలని మీనాక్షి నటరాజన్ కోరారు. ఇప్పటికే పదవుల్లో ఉన్న కార్పొరేషన్ ఛైర్మన్ల పనితీరును బేరీజు వేసి, వారి పదవీకాలం పొడిగింపు లేదా కొత్త వారి నియామకంపై ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడం, పార్టీ బలోపేతంపై చర్చించేందుకు వారంలోగా రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో కేబినెట్ విస్తరణ, జిల్లా స్థాయి కమిటీల నియామకంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande