
నిర్మల్, 15 ఏప్రిల్ (హి.స.)
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అరైవ్ అలైవ్ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న జయశంకర్ చౌరస్తా సమీపంలో విద్యార్థులచే భారీ మానవహారం నిర్వహించారు. ఈ మానవహారం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో కళాజాత బృందాలు తమ పాటల ద్వారా ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు
కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచి పిల్లలందరూ ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. జిల్లాలో పాఠశాలల విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగించేలా సంబంధిత అధికారులతో కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పాఠశాలలలో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని అన్నారు.
విద్యార్థులే రోడ్డు భద్రత నియమాలపై ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ లు అని, పిల్లలు మంచి విషయాలు చెబితే ప్రతి ఒక్కరు తప్పకుండా వింటారని అన్నారు. విద్యార్థులు తమ ఇండ్లలో తల్లిదండ్రులకు, సమాజంలోని వ్యక్తులకు ట్రాఫిక్ నియమాల గురించి చైతన్యం కలిగించాలన్నారు. తమ కుటుంబ సభ్యులు వాహనాలలో బయటకు వెళ్ళునప్పుడు, హెల్మెట్, సీట్ బెల్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం వంటి రోడ్డు భద్రత విషయాలపై వివరించాలని తెలిపారు. విద్యార్థులు
ఎవరు తగిన వయస్సు లేనిదే వాహనాలను నడుపరాదని సూచించారు. పలువురు విద్యార్థులు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగించేలా ఉపన్యాసాలు ఇచ్చారు. కలెక్టర్, అధికారులు, విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..