టీడీపీలో నూతన శకం.. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్
టీడీపీలో నూతన శకం.. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్
Lokesh


అమరావతి, 15 ఏప్రిల్ (హి.స.)

: తెలుగుదేశం పార్టీని రాబోయే 2029 ఎన్నికలకు సమరోత్సాహంతో సిద్ధం చేసే క్రమంలో అధినేత నారా చంద్రబాబు నాయుడు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటిస్తూ.. విధేయతకు, కష్టపడే తత్వానికి పెద్దపీట వేశారు.

లోకేష్కు జాతీయ బాధ్యతలు.. పల్లాకు రాష్ట్ర పగ్గాలు

పార్టీలో నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా మంత్రి నారా లోకేష్ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును కొనసాగిస్తూ పార్టీ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని గుర్తించారు.

ఈ నూతన కార్యవర్గంలో చంద్రబాబు నాయుడు సామాజిక సమీకరణాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. మొత్తం 185 మందితో కూడిన రాష్ట్ర కమిటీలో 122 స్థానాలను బడుగు, బలహీన వర్గాలకే కేటాయించి సామాజిక విప్లవానికి తెరలేపారు. ఇందులో బీసీలకు 77, ఎస్సీలకు 25, ఎస్టీలకు 7 మరియు మైనార్టీలకు 13 స్థానాలు కల్పించారు. శాతాల వారీగా చూస్తే బీసీలకు 40 శాతం, ఎస్సీలకు 25 శాతం చొప్పున ప్రాతినిధ్యం లభించింది. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తులో రాబోయే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మరియు 33 శాతం మహిళా రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని మహిళలకు పెద్దపీట వేశారు. రాష్ట్ర కమిటీలో ఏకంగా 50 మంది మహిళలకు చోటు కల్పించడం విశేషం.

పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కిందిస్థాయి కార్యకర్తలకు అత్యున్నత గౌరవం దక్కింది. పార్టీ నిర్ణాయక మండలి అయిన పొలిట్ బ్యూరోలో సామాన్య కార్యకర్తలను నియమించి చంద్రబాబు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ మండల పార్టీ అధ్యక్షురాలిని నేరుగా పొలిట్ బ్యూరోలోకి తీసుకోవడం ద్వారా, పార్టీ కోసం కష్టపడే వారికి ఆకాశమే హద్దు అని నిరూపించారు. 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీని కూర్చారు. జాతీయ కమిటీలో ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, 18 మంది ఉపాధ్యక్షులు మరియు 10 మంది అధికార ప్రతినిధులకు అవకాశం కల్పించారు.

మొత్తంగా పార్టీ యంత్రాంగాన్ని కొత్త పుంతలు తొక్కించేలా ఈ నియామకాలు జరిగాయి. రాష్ట్ర కమిటీలో ఏడుగురు ప్రధాన కార్యదర్శులు, 16 మంది ఉపాధ్యక్షులు, 14 మంది అధికార ప్రతినిధులు, 10 మంది జోనల్ కో-ఆర్డినేటర్లను నియమించారు. వీటితో పాటు నాలెడ్జ్ కమిటీ, హెచ్ఆర్డీ కమిటీల్లో కూడా నియామకాలు పూర్తి చేశారు. సీనియర్ల అనుభవాన్ని, యువత ఉత్సాహాన్ని సమతుల్యం చేస్తూ రూపొందించిన ఈ కమిటీలు రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande