
అద్దంకి, 17 ఏప్రిల్ (హి.స.)
చక్రాయపాలెం ఉర్సు ఉత్సవాల్లో పాల్గొని తిరుగుప్రయాణమైన వారిని అతివేగంతో వెళ్తున్న కారు బలి తీసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రకాశం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను అద్దంకి సీఐ సుబ్బరాజు వెల్లడించారు. నూర్భాషా సంఘం నాయకుడు, అద్దంకి భవానీకూడలికి చెందిన కొటికలపూడి శ్రీనుకుసుమావలి(33), గుంటూరు పట్టణానికి చెందిన షేక్ సాంబయ్య(55), గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన షేక్ సర్ఫరాజ్లు సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద జరుగుతున్న ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నారు. మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఓ ద్విచక్ర వాహనంపై సాంబయ్య, సర్ఫరాజ్లు, స్కూటీపై కొటికలపూడి శ్రీను బయల్దేరారు. చక్రాయపాలెం గ్రామ సమీపంలోకి రాగానే.. నరసరావుపేట నుంచి మేదరమెట్ల వెళ్తున్న కారు అతివేగంతో వచ్చి తొలుత ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు సాంబయ్య కారుపై నుంచి ఎగిరి పడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. ద్విచక్ర వాహనం నడిపిస్తున్న సర్ఫరాజ్ రోడ్డు పక్కన పడిపోయారు. అప్పటికి కారు వేగం అదుపుచేయలేని డ్రైవర్ ముందు స్కూటీపై వెళ్తున్న కొటికలపూడి శ్రీనివాసరావును కూడా ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకుంటూ వెళ్లాడు. స్కూటీ, కారు మధ్యలో ఇరుక్కుని ఆయన మరణించారు. తీవ్రంగా గాయపడిన సర్ఫరాజ్ను స్థానికులు ఒంగోలులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను పి.విశ్వేశ్వరరావుగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆయన మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. శ్రీను భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ