
హైదరాబాద్, 17 ఏప్రిల్ (హి.స.)తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడిని కల్వకుంట్ల కవిత మరింత ఉద్ధృతం చేశారు. ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలను ప్రస్తుత ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆమె ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన కవిత, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. ఆరు నెలల్లోగా పీఆర్సీ అమలు చేస్తామన్న మాట ఏమైందని ప్రశ్నించిన ఆమె, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామన్న వాగ్దానాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక అవసరాలైన హెల్త్ స్కీం, వైద్య ఖర్చుల రీయింబర్స్మెంట్ వంటి అంశాల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రిటైర్మెంట్ బకాయిల కోసం వృద్ధాప్యంలో ఉద్యోగులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఐదు వాయిదాల కరవు భత్యం ఊసే లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అని ఆమె ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నేడు రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు చేపట్టే నిరసన ప్రదర్శనలకు తెలంగాణ జాగృతి తరపున తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు. న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తాము అండగా ఉంటామని స్పష్టం చేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం మొండివైఖరి వీడి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi