
హైదరాబాద్, 17 ఏప్రిల్ (హి.స.)
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తెలంగాణలో సాగుతున్న ప్రచారాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో మీడియా ముఖంగా మాట్లాడిన ఆయన... ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ 'నార్త్ వర్సెస్ సౌత్' వివాదాన్ని సృష్టించేందుకు విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ప్రధాని మోదీ సమన్యాయం చేస్తారని, జనాభా ప్రాతిపదికన సీట్ల విభజన జరిగినా దక్షిణాది ప్రాధాన్యత తగ్గబోదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏపీలో సీట్లు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కు, తమిళనాడులో 39 నుంచి 59కి పెరిగే అవకాశం ఉందని ఆయన గణాంకాలను వివరించారు.
మరోవైపు, మహిళా రిజర్వేషన్ బిల్లుపై కూడా కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ పార్టీ తన సీట్లు ఎక్కడ పోతాయో అన్న భయంతో మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తోందని, ఆ పార్టీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ వత్తాసు పలుకుతున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ ఫార్ములా అసలు ఆయనది కాదని, అది అసదుద్దీన్ ఓవైసీ వెనుక ఉండి చెప్పించిన ఫార్ములా అని ఆయన ఆరోపించారు.
కేవలం హైదరాబాద్లో ఎక్కువ ఆదాయం వస్తుందని అక్కడ సీట్లు పెంచమంటారా? అని ప్రశ్నించిన ఆయన... డబ్బున్న చోట ఓటు విలువ ఎక్కువగా ఉండాలని కోరుకోవడం ఏ రకమైన ప్రజాస్వామ్యం అని నిలదీశారు. మహిళలను అణగదొక్కే రాజకీయాలకు ఎంఐఎం కేంద్ర బిందువుగా మారిందని, విపక్షాలన్నీ కలిసి మహిళా నాయకత్వాన్ని అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi