
శ్రీశైలం, 17 ఏప్రిల్ (హి.స.)
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో పెద్దపులి సంచారం భక్తులను, స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. శ్రీశైలం క్షేత్రానికి ప్రధాన ప్రవేశ ద్వారంగా భావించే సాక్షి గణపతి ఆలయ సమీపంలో ఓ పెద్దపులి సంచరిస్తున్నట్లు గురువారం రాత్రి ఆలయ సిబ్బంది గుర్తించారు. దట్టమైన నల్లమల అడవుల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో పులి అడుగుజాడలు కనిపించడం, ప్రత్యక్షంగా కనిపించడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ సమాచారాన్ని వెంటనే అటవీ శాఖ అధికారులకు, దేవస్థానం భద్రతా సిబ్బందికి చేరవేశారు.
పులి సంచార నేపథ్యంలో సాక్షి గణపతి ఆలయానికి వచ్చే భక్తులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు అటవీ మార్గాల్లో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. అటవీ శాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి, పులి మళ్లీ జనారణ్యంలోకి రాకుండా పర్యవేక్షిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV