
కడప, 02 ఏప్రిల్ (హి.స.)
, , ఒంటిమిట్ట: వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణోత్సవం బుధవారం వైభవోపేతంగా నిర్వహించారు. కల్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి భక్తులు అశేష సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపథ్యంలో కోదండ రామాలయాన్ని శోభాయమానంగా తితిదే ముస్తాబు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు మనవడు దేవాన్ష్తో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, తితిదే కానుకగా అందజేసిన కిలో బంగారంతో తయారు చేసిన స్వర్ణముఖ పట్టీని సమర్పించారు.
పరిణయ వేడుకను తిలకించడానికి వచ్చిన భక్తులకు స్వామివారి తలంబ్రాలను ఉచితంగా పంపిణీ చేశారు. వీటితో పాటు లడ్డూ ప్రసాదం అందజేశారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు కల్యాణోత్సవం దేదీప్యమానంగా సాగింది. జగత్కల్యాణ ఘట్టాన్ని పండు వెన్నల్లో కనుల పండువగా తితిదే నిర్వహించింది. కల్యాణ మండపాన్ని దేశ విదేశాల నుంచి తీసుకొచ్చిన అరుదైన పుష్పాలతో అలంకరించారు. ఉత్సవం చివరి వరకు చంద్రబాబు దంపతులు, తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, మంత్రులు రామనారాయణరెడ్డి, రాంప్రసాద్రెడ్డి, ఎమ్మెల్యేలు పుట్టా సుధాకర్ యాదవ్, మాధవిరెడ్డి, పుత్తా చైతన్యరెడ్డి, ఆదినారాయణరెడ్డి, తెదేపా పొలిట్ బ్యూ రో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి, తితిదే సభ్యులు వీక్షించారు. జైశ్రీరామ్ నామస్మరణతో కల్యాణోత్సవ వేదిక ధ్వనించింది. ముఖ్యమంత్రి దంపతులు ఒంటిమిట్టలోనే రాత్రికి బస చేశారు. గురువారం ఉదయం 8.30 గంటలకు తిరుగు ప్రయాణం కానున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ