
అమరావతి, 02 ఏప్రిల్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఐదేళ్ల పాలనా కాలం నేటితో (గురువారం) అధికారికంగా ముగిసింది. 2021లో ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల పదవీ కాలం ఏప్రిల్ 2 అర్ధరాత్రితో పూర్తి కావడంతో, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల నిర్వహణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎన్నికలు జరిగి, పాలకవర్గాలు కొలువుదీరే వరకు గ్రామాల్లో పాలన కుంటుపడకుండా 'ప్రత్యేకాధికారుల' (Special Officers) నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏప్రిల్ 3 (శుక్రవారం) ఉదయం నుంచి గ్రామ పంచాయతీల బాధ్యతలను ప్రత్యేకాధికారులు స్వీకరిస్తారు.
ఆయా మండలాల్లోని తహశీల్దార్లు, ఎంపీడీఓలు (MPDO), ఎంఈఓ (MEO), ఇతర గెజిటెడ్ స్థాయి అధికారులకు గ్రామ పంచాయతీల అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలను అప్పగించారు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని గ్రామాలకు అధికారులను కేటాయిస్తూ ఇప్పటికే నియామక ప్రక్రియను పూర్తి చేశారు. సర్పంచులు తమ రికార్డులను, చెక్ పవర్ బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV