
అమరావతి, 02 ఏప్రిల్ (హి.స.)
అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(గురువారం) ఏపీ ఆర్థిక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన పెండింగ్ బిల్లుల చెల్లింపులపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులపై ఆరా తీశారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరపాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఏ మేరకు అమలు చేశారని అధికారులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. దానిపై కసరత్తు చేశామని, నిధుల లభ్యతను బట్టి చెల్లింపులు జరుపుతున్నామని అధికారులు వివరించా
ఉద్యోగులకు రిలీఫ్ ఇచ్చేలా మొత్తంగా రూ.7,358 కోట్ల మేర పెండింగ్ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకున్నామని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రావిడెంట్ ఫండ్ బకాయిల కింద రూ.1,848 కోట్లను నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశామని, అలాగే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద 4,793 మందికి సంబంధించిన రూ.76 కోట్ల చెల్లింపులు కూడా పూర్తి చేశామని వెల్లడించారు. వీటితోపాటు గ్రాట్యుటీ బకాయిల కింద రూ.3,411 కోట్లు, పెండింగ్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల లీవ్ ఎన్క్యాష్మెంట్ కింద రూ.1,800 కోట్లు, పోలీస్ శాఖకు సంబంధించి అదనపు సరెండర్ లీవ్ల నిమిత్తం రూ.223 కోట్ల బిల్లుల విడుదల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మరో రెండు రోజుల్లో చెల్లింపులు పూర్తి చేస్తామని చంద్రబాబుకు అధికారులు చెప్పారు. తల్లికి వందనం తర్వాత ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో చెల్లింపులు జరుపుతోంది ఉద్యోగులకు మాత్రమేనని ముఖ్యమంత్రికి వివరించారు. నిధుల లభ్యతను బట్టి ఉద్యోగుల పెండింగ్ బిల్లుల సహా అన్ని రకాల పెండింగ్ బిల్లులకు చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
బిల్లులు అడిగితే వేధింపులా..?
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ