
అమరావతి, 27 ఏప్రిల్ (హి.స.)
ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుహెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే ఉపేక్షించమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు సంబంధిత అధికారులతో ఈరోజు(సోమవారం) సచివాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమస్య పరిష్కారానికి నిన్న (ఆదివారం) రాత్రి నుంచి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై సీఎం అధికారులను వివరణ కోరారు.
ఈ రోజు (సోమవారం) సాయంత్రానికి మెజార్టీ ప్రాంతాల్లో సాధారణ స్థితి ఏర్పడుతుందని ముఖ్యమంత్రికి అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు వివరించారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో సాధారణ పరిస్థితిని తీసుకువచ్చేందుకు అధికారులు, ఆయిల్ కంపెనీల యాజమాన్యాలు సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు. ఉదయం డిస్పాచ్ సెంటర్ల నుంచి వెళ్లిన ఆయిల్ ట్యాంకర్లు ఇవాళ సాయంత్రం వరకూ రిటైల్ బంకులకు చేరుకుంటాయని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు తెలిపారు. స్వయంగా కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఆయిల్ సరఫరా జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.
కలెక్టర్లు సరఫరాను పర్యవేక్షించాలి..
కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు వెళ్లి సరఫరాను పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో పరిస్థితులపై ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించి ప్రతీ మూడు గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు, మంత్రులకు సీఎం ఆదేశించారు. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా అధికారులు స్పందించాలని ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు ఎలాంటి జాప్యం లేకుండా ఆయిల్ ట్యాంకర్లు చేరుకునే విధంగా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ మార్కెట్, కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఆయిల్ కంపెనీలు నిరంతరం పని చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
ఈరోజు సాయంత్రంలోగా అన్ని బంకులకు పెట్రోల్, డీజిల్ చేరుతుందని అధికారులు స్పష్టం చేశారు. పెట్రోల్ బంక్ నుంచే అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇంధన సమస్యతో రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. క్యానుల్లో కొట్టాలంటే వీఆర్వో దగ్గర లెటర్ తీసుకోవాలని అధికారులు తెలిపారు. తమను పట్టించుకోవట్లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు వీఆర్వో లెటర్ కావాలంటే అది తీసుకువచ్చి ఎప్పుడు కొట్టించుకోవాలని రైతన్నలు ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ