
హుజురాబాద్, 27 ఏప్రిల్ (హి.స.)
హుజురాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం నాలుగు స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా హుజురాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా తన పూర్తి ఆధిపత్యాన్ని చాటుకుంది.
నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ నేతృత్వంలో ఈ ఎంపిక ప్రక్రియ అత్యంత వ్యూహాత్మకంగా జరిగింది. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపునిస్తూనే, సామాజిక సమతుల్యతను పాటించడంలో ప్రణవ్ విజయవంతమయ్యారు. బి.సి, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూనే, మహిళలకు రెండు స్థానాలను కేటాయించి మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. ఈ నేపథ్యంలోనే గొట్టే జమదగ్ని, మహమ్మద్ అబ్దుల్ అలీం, ఆలేటి సుశీల, ఫరీదా బేగం లు కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు.
నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వొడితల ప్రణవ్, అన్నీ తానై ఈ ఎన్నికను ముందుండి నడిపించారు. ఈ విజయం పట్ల హుజురాబాద్ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం జరుగుతుందనడానికి ఈ ఎంపికలే నిదర్శనమని, హుజురాబాద్ అభివృద్ధిలో ఈ విజయం కీలక పాత్ర పోషిస్తుంది. అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు