
నాగార్జునసాగర్, 27 ఏప్రిల్ (హి.స.)
నాగార్జునసాగర్ పరిధిలోని పాల్తీ తండా గ్రామంలో ఆన్లైన్ మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపుల కారణంగా ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాలాజీ (38) కొద్ది రోజుల క్రితం ఒక ఆన్లైన్ రుణ యాప్ ద్వారా రుణం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే రుణ చెల్లింపుల విషయంలో సంస్థ ప్రతినిధులు ప్రతిరోజూ పదేపదే ఫోన్ కాల్స్ చేస్తూ తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు వారు ఆరోపిస్తున్నారు. ఈ నిరంతర వేధింపుల వల్ల బాలాజీ మానసికంగా తీవ్ర ఆందోళనకు గురయ్యాడని, సోమవారం కూడా వరుసగా కాల్స్ రావడంతో అతను అకస్మాత్తుగా అస్వస్థతకు గురై గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుని బంధువులు విజయపురి నార్త్ పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా నిర్వహించారు. కొంతసేపు రహదారిపై వాహన రాకపోకలు అంతరాయం కలగగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..