జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి.. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి.. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Collector


జనగామ, 27 ఏప్రిల్ (హి.స.)

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు ఆదేశించారు. టోకెన్ పద్ధతిని తప్పనిసరిగా అమలు చేయాలని, కేంద్రాల్లో మౌలిక వసతులు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం పెంబర్తి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు వివరాలు, అందుబాటులో ఉన్న టార్పాలిన్ కవర్లు, గన్నీ బ్యాగులు, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలింపు వంటి అంశాలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు సాఫీగా సాగేందుకు మూడు దశల్లో టోకెన్ పద్ధతిని అమలు చేస్తున్నామని, దీనిని సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా పాటించాలని ఆయన పేర్కొన్నారు. తేమ శాతం ఉన్న ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేసి, రైతులకు ఆలస్యం లేకుండా సేవలు అందించాలని సూచించారు. కొనుగోలు పూర్తైన వెంటనే ట్యాగ్ చేసిన మిల్లులకు ధాన్యం బస్తాలను తరలించాలన్నారు. రవాణా విషయంలో ఎలాంటి ఆలస్యం లేకుండా తగిన లారీలను సమయానికి అందుబాటులో ఉంచాలని, కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. వేసవి ఎండల దృష్ట్యా రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని, టోకెన్ ప్రకారం కేటాయించిన సమయానికే కేంద్రాలకు రావాలని కలెక్టర్ సూచించారు. అలాగే కేంద్రాల్లో తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande