విజయనగరం జిల్లాలో విషాదం ..కారు ప్రమాదంలో నలుగురు మృతి
విజయనగరం జిల్లాలో విషాదం ..కారు ప్రమాదంలో నలుగురు మృతి
విజయనగరం జిల్లాలో విషాదం ..కారు ప్రమాదంలో నలుగురు మృతి


విజయనగరం జిల్లా,, 28 ఏప్రిల్ (హి.స.)

విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. పూసపాటిరేగ మండల పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మితిమీరిన వేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై విజయనగరం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వేగంగా వెళ్తున్న ఒక కారు, పూసపాటిరేగ మండలం పేరాపురం జంక్షన్ వద్దకు చేరుకోగానే అదుపు తప్పింది. ఆ సమయంలో పేరాపురం దగ్గర రోడ్డు దాటుతున్న ఇరువురిని ఢీకొట్టింది. అనంతరం లారీని ఢీకొన్న ఘటనలో కారు డ్రైవర్ సహా మరొకరు మృతిచెందారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలను సేకరించి, పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ఈ ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు క్రేన్ సహాయంతో ధ్వంసమైన కారును పక్కకు తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

కృష్ణా జిల్లాలో బస్సు ప్రమాదంలో ఒకరి మృతి

మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనకనుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొంది. ఈ బస్సు యానం నుంచి హైదరాబాద్ వెళ్తుంది. ఇందులో 15 మందికిపైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఉయ్యూరు, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సులో ఉన్న క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందారు. బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను స్థానికులు కాపాడారు. అతివేగమే కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. ఉయ్యూరు జీయో పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande