
హైదరాబాద్, 06 ఏప్రిల్ (హి.స.)ఈనెల 25న కొత్త రాజకీయ పార్టీ ప్రకటించబోతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అందుకు తగినట్లుగా వ్యూహాలు రచిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల సింగరేణి కార్మికులతో భేటీ అవ్వగా తాజాగా నేడు (సోమవారం) బంజారా నేతలను కలిశారు. రిటైర్డ్ అడిషనల్ డీజీ డీటీ నాయక్ సహా పలువురు బంజారా ప్రముఖులతో కవిత భేటీ అయ్యారు. హైదరాబాద్లోని డీటీ నాయక్ నివాసానికి వెళ్లిన కవిత మర్యాదపూర్వకంగా వారితో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా తన కొత్త రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వాలని కవిత వారిని కోరారు. పార్టీ ఏర్పాటు నేపథ్యంలో బంజారా సమాజం కోసం ఏం చేయాలనే దానిపై వారితో కూలంకషంగా ఆమె చర్చించారు. ఆ సామాజిక వర్గానికి ఏం చేయాలో అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే బంజారాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే మొదటిసారి అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఏర్పాటు చేయబోయే పార్టీలో వారికి సముచిత అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు బంజారా ప్రముఖులంతా తాము ఏర్పాటు చేయబోయే పార్టీకి సలహాలు, సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించాలనుకునే వారిని తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్