ఏసీబీ వలకు చిక్కిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ ఇన్ స్పెక్టర్-ఎస్సై
ఏసీబీ వాళ్లకు చిక్కిన ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ ఇన్స్పెక్టర్
ACB


హైదరాబాద్, 08 ఏప్రిల్ (హి.స.)

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఔట్పోస్ట్

ఈ పోలీస్ స్టేషన్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. రూ. 2 లక్షలు లంచం తీసుకుంటున్న ఇన్ స్పెక్టర్ కనకయ్య, ఎస్సై సిద్దేశ్వర్ను రెడ్యండెడ్గా పట్టుకున్నారు. దాడులు మంగళవారం సాయంత్రం ప్రారంభమై అర్ధరాత్రి వరకు కొనసాగాయి. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన ఒక వ్యక్తి ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్తో ప్రయాణించేందుకు ప్రయత్నిస్తూ ఇటీవల పట్టుబడ్డాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఔట్పోస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. అతడిని రిమాండ్కు తరలించారు. జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో అతడు ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్కు హాజరవుతున్నాడు. ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేయడానికి ఇన్ స్పెక్టర్ కనకయ్య, ఎస్సై సిద్దేశ్వర్ కలిసి బాధితుని నుంచి రూ.15 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

అదేవిధంగా బాధితుడి కుటుంబ సభ్యులను కూడా చార్జిషీట్లో చేరుస్తామని బెదిరించారు. తాను 15 లక్షలు చెల్లించలేనని తెలిపిన బాధితుడు, చివరకు రూ.5 లక్షలు ఇస్తానని పోలీసులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం విషయం ఏసీబీ అధికారులకు తెలియజేయడంతో వారు పక్కా ప్రణాళికతో ఉచ్చు బిగించారు. మొదటి విడతగా మంగళవారం సాయంత్రం బాధితుడు రూ.2 లక్షలు నగదు తీసుకుని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఔట్పోస్ట్ పోలీస్ స్టేషన్కు వెళ్లగా, ఆ మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఇన్ స్పెక్టర్, ఎస్సైలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేయనున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande