వెంకటాద్రి ఎక్స్ప్రెస్ పై దోపిడీ ముఠా రాళ్ల వర్షం..
రైల్వే ట్రాక్ పై రాయి రాళ్ళను పెట్టి దోచుకునేందుకు ప్రయత్నం
Venkatadri


షాద్నగర్, 08 ఏప్రిల్ (హి.స.)

వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ రైలులో

చొరబడి దోచుకునేందుకు రైల్వే ట్రాక్లపై రాళ్లు పెట్టి రైలును ఆపేందుకు దోపిడీ ముఠా ప్రయత్నించింది. రైలు ఆగకుండా వెళ్లడంతో రాళ్ళతో రైలుపై దాడికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. కాచిగూడ నుంచి చిత్తూరు వెళ్తున్న (రైలు నెంబర్ 12797) వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు తిమ్మాపూర్ స్టేషన్ వద్దకు రాగానే 30 నుంచి 40 మంది సభ్యుల ముఠా రైలు పట్టాలపై రాళ్లను పెట్టి ఆపేందుకు ప్రయత్నించింది. రాళ్లను ఢీకొంటూ వెళ్లిపోయిన సూపర్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ పై ముఠా రాళ్లతో దాడికి పాల్పడ్డారు. రైలులో పైలట్గా వెళ్తున్న రైల్వే రక్షక దళం సిబ్బంది కాచిగూడ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ముఠాను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ముఠా సభ్యులు పోలీసులపై సైతం రాళ్ల దాడికి పాల్పడ్డారు. ముఠాను వెంబడించిన పోలీసుల నుంచి వారు తప్పించుకుని పారిపోయారు. ముఠాలోని ఇద్దరు మహిళలను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్పై ముఠా దాడిలో ఏసీ కోచ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. జరిగిన దాడిపై కాచిగూడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande