తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు.. ఈ ప్రాంతాలకు భారీ వర్షసూచన.. ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్
తెలుగురాష్ట్రాలలో వర్షాలు పడే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ
rain


అమరావతి, 06 ఏప్రిల్ (హి.స.)తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే ఐద్రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. దీనికి కారణం తుఫాన్లు, వాయుగుండం. ఆస్ట్రేలియా వైపు మైలా, వలను అనే రెండు తుఫాన్లు ఏర్పడగా.. హిందూ మహాసముద్రంలో ఇందుసా అనే వాయుగుండం కొనసాగుతోంది. ఈ కారణాలతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న కొద్ది రోజుల పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇక అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏప్రిల్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 5 రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది.

ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్ర వరకు భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇక పిడుగుపాటు హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక రాయలసీమలో ఎండ ప్రభావం ఉంటుందని, ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదవుతాయని స్పష్టం చేశారు. 39 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణశాఖ సూచించింది. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఇక ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉదయం నుంచి స్వల్ప వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఇక సాయంత్రం ఖమ్మం పరిసర ప్రాంతాల్లో వానలు కురుస్తాయంది. ఈదురుగాలులు 26 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, బైక్పై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దక్షిణ తెలంగాణతో పాటు హైదరాబాద్లో ఎండ తీవ్రత ఉండే అవకాశముంది. 38 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande