
కరీంనగర్, 06 ఏప్రిల్ (హి.స.)నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు లాభమే తప్ప, నష్టం ఉండబోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆయన కరీంనగర్లో మాట్లాడుతూ పునర్విభజనలో భాగంగా 50 శాతం సీట్లను పెంచితే దక్షిణాదికి తీవ్రనష్టం జరుగుతుందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో దేశభక్తి, జాతీయవాదం మచ్చుకైనా కనిపించడం లేదని, రేవంత్రెడ్డి వాఖ్యలను దేశభక్తి ఉన్న జాతీయవాదులెవరూ జీర్ణించుకోలేరని పేర్కొన్నారు.
రేవంత్రెడ్డి అబద్ధాల పునాదులపైన పాలన చేస్తున్నారని, ఆరు గ్యారంటీల అమలుపై ప్రజల దృష్టి మళ్లించేందుకు రోజుకో కొత్త అంశాన్ని తెరమీదకు తెస్తూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఆయన తన రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఉత్తరాదికి లాభం, దక్షిణాదికి నష్టమని మాట్లాడుతూ దేశాన్ని ముక్కలు చేయాలని కుట్రల చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాంతీయ విభేదాలు సృష్టించి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కొత్త డ్రామాలాడుతున్నారని, ఇంకెన్నాళ్లు ప్రాంతీయ అసమానతల పేరు చెప్పి చలికాచుకుంటారని విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్