
హైదరాబాద్, 06 ఏప్రిల్ (హి.స.)వేసవి సెలవుల్లో కార్పొరేట్ కాలేజీలు తరగతులు నిర్వహించడంపై పీడీఎస్యూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు అడ్మిషన్లు చేపట్టడంపై నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు విద్యార్థి సంఘం ధర్నా నిర్వహించింది. కార్పొరేట్ కాలేజీలు రిజల్ట్స్ రాకముందే అడ్మిషన్లు తీసుకుని, ఫీజు రాయితీ పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని పీడీఎస్యూ ఆరోపించింది. ఇలాంటి కాలేజీల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా అడ్మిషన్లు కొనసాగిస్తున్న కాలేజీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పీడీఎస్యూ ప్రభుత్వాన్ని కోరింది.
ప్రభుత్వం జారీ చేసిన జీఓలను పక్కన పెట్టి ప్రైవేట్ విద్యాసంస్థలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని పీడీఎస్యూ ఆవేదన వ్యక్తం చేసింది. వేసవి సెలవుల్లో కూడా క్లాసులు నిర్వహిస్తున్నాయని పేర్కొంది.
కార్పొరేట్ కాలేజీలకు మాత్రమే అవకాశాలు పెరుగుతుండటంపై ప్రభుత్వ వైఖరిని పీడీఎస్యూ విమర్శించింది. జూనియర్ కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్