
అమరావతి, 06 ఏప్రిల్ (హి.స.)వైసీపీ రాజకీయ పార్టీలా కాకుండా ప్రజలను మభ్యపెట్టే డ్రామా కంపెనీలా తయారైందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. శాసనసభలో ఒకవైపు అమరావతే రాజధాని అని ఒప్పుకుంటూనే.. బయట మాత్రం రాజధానిపై విషం చిమ్మడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. అమరావతి అభివృద్ధిని దోపిడీ అంటున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అసలైన దోపిడీ అంటే ఏంటో తెలుసుకోవాలని మండిపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని వేల కోట్లు సంపాదించడాన్ని దోపిడీ అంటారని.. అక్రమ ఆస్తుల కేసుల్లో ఇరుక్కుని ఏళ్ల తరబడి బెయిల్ మీద తిరగడాన్నీ దోపిడీ అంటారని ఎమ్మెల్సీ అనురాధ చెప్పుకొచ్చారు.
పోలవరం ప్రాజెక్టు పని మొదలు పెట్టకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరుతో నిధులు వెనకేసుకోవడమే దోపిడీ అని.. మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్స్ లేకుండా నగదు వసూళ్లు చేయడాన్ని కూడా దోపిడీ అంటారని జగన్కు చురకలు అంటించారు. . అమరావతి అంటే కేవలం భూములు కాదు.. అది ఐటీ హబ్, స్పోర్ట్స్ సిటీ, యూనివర్సిటీలు, వేల మంది యువతకు ఉపాధి కల్పించే గ్లోబల్ సెంటర్ అని కొనియాడారు. ఏపీ రాజధాని లేని పరిస్థితిని చూసి దేశమంతా జాలిపడుతోందని, ఇతర రాష్ట్రాల ఎంపీలు సైతం పార్లమెంట్లో ఈ విషయంపై మాట్లాడటం వైసీపీ నైతిక ఓటమికి నిదర్శనమని చెప్పుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్