
పిడుగురాళ్ల, 06 ఏప్రిల్ (హి.స.)పిడుగురాళ్ల మెడికల్ కాలేజీతోపాటు ఆసుపత్రి సేవలు ఈ ఏడాది ప్రారంభిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు. ఈ మెడికల్ కాలేజీ, బోధన ఆసుపత్రి నిర్మాణం నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. సోమవారం పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీతోపాటు ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయి పదమూడేళ్లు అయినా.. రాజధాని లేదని దేశమంతా నవ్వుతున్నారని అన్నారు. గత పాలకుల వల్లే మన రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. గత ఐదేళ్ల కాలంలో మూడు ప్రాంతాల పేర్లు చెప్పారని.. ప్రస్తుతం మూడు ఊర్ల పేర్లు చెబుతున్నారంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్తోపాటు ఆ పార్టీ నేతలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇప్పటికి కూడా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతల తీరును ఈ సందర్భంగా ఎండగట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్