
జోగులాంబ గద్వాల, 07 ఏప్రిల్ (హి.స.)
పదవ తరగతి పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని విశ్వభారతి టెక్నో పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల నిర్వహణ తీరును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షా కేంద్రంలోని తరగతి గదులను సందర్శించి, విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును గమనించారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు,సెల్ ఫోన్లు అనుమతించరాదని అన్నారు.పరీక్ష సమయంలో బిట్ పేపర్ను సమయానికి అందజేయాలన్నారు. సమాధాన పత్రాలను తీసుకునే సమయంలో పరిశీలించాలని సూచించారు. విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.
పరీక్షలు ముగిసేంత వరకు అప్రమత్తతతో పకడ్బందీగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పూర్తి పారదర్శకంగా, పరీక్షలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు