
హైదరాబాద్, 07 ఏప్రిల్ (హి.స.)
మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తున్న బాధితులను కలిసేందుకు ఆయన వెళ్లకుండా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. హరీశ్ రావు నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి, ఆయనను బయటకు రాకుండా అడ్డుకున్నారు.
కేవలం హరీశ్ రావు మాత్రమే కాకుండా, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరిట తమకు ఉన్న 1200 ఎకరాల సాగు భూములను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని ఆరోపిస్తూ రైతులు గత కొన్ని రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపేందుకు వస్తున్న హరీశ్ రావు పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
రైతుల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తారా అని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని హరీశ్ రావు విమర్శించారు. ప్రస్తుతం పరిగి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..