
అమరావతి, 07 ఏప్రిల్ (హి.స.) శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు మరింత మెరుగైన ఆధ్యాత్మిక అనుభూతిని పంచేందుకు తితిదే సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుడుతోంది. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు సాంత్వన కలిగించేలా వర్చువల్ రియాలిటీ (వీఆర్) సాంకేతికతను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది.తొలి విడతలో ఈ సదుపాయాన్ని క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లలో ఏర్పాటు చేయనున్నారు. గంటల కొద్దీ వేచి ఉండే భక్తులకు అసౌకర్యం కలగకుండా, వారి దృష్టిని ఆధ్యాత్మికత వైపు మళ్లించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.
ఈ వీఆర్ హెడ్సెట్ల ద్వారా శ్రీవారి వైభవం, తిరుమల క్షేత్ర విశేషాలు, ఇతర పవిత్ర దృశ్యాలను వర్చువల్ విధానంలో వీక్షించవచ్చు. డొనేషన్ విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉంది. ఈ పరిశీలన పూర్తయి, ఉన్నతాధికారుల నుంచి ఆమోదం లభిస్తే కంపార్ట్మెంట్లలోని భక్తులు సరికొత్త విధానంలో ఆధ్యాత్మిక అనుభూతిని పొందడానికి మార్గం సుగమం అవుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ