
అమరావతి, 07 ఏప్రిల్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత పదేళ్లుగా కొనసాగుతున్న ఉత్కంఠ కి తెరపడింది. అమరావతిని రాష్ట్ర ఏకై, శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటు ఆమోదించిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం-2026 కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ఆమోదముద్ర వేశారు. సోమవారం (ఏప్రిల్ 6) రాత్రి కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ను కూడా విడుదల చేసింది. ఈ చారిత్రాత్మక పరిణామంపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంతో కూడిన సందేశాన్ని పంచుకున్నారు.
ఈ రోజు ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఒక చారిత్రాత్మక దినం. గౌరవనీయులైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం-2026 కు ఆమోదం తెలపడంతో, మన రాజధాని కల అధికారికంగా నిజమైంది అని లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం దార్శనికతతో మద్దతు అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పార్లమెంటులో ఈ బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అమరావతి రైతులకు సెల్యూట్
ముఖ్యంగా అమరావతి కోసం భూములిచ్చి, గత ఐదేళ్లుగా అనేక కష్టాలను ఓర్చి పోరాడిన రైతుల త్యాగాన్ని లోకేశ్ కొనియాడారు. అమరావతి రైతుల సహనం, త్యాగం, నిబద్ధత వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైంది. వారికి నా ప్రత్యేక సెల్యూట్. మనమందరం కలిసి ఈ విజయాన్ని సాధించాం అని ఆయన ట్వీట్ చేశారు. ఈ చట్టం అమల్లోకి రావడంతో, 2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2) సవరించబడింది, దీని ప్రకారం ఇకపై అమరావతి ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత రాజధానిగా చట్టబద్ధత పొందింది. ఈ విజయం రాష్ట్ర అభివృద్ధికి పునాది అని లోకేశ్ ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV