
అమరావతి, 07 ఏప్రిల్ (హి.స.)
ఏపీలో ఒకే సమయంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఎండలు మండిపోతోంటే.. మరోవైపు సాయంత్రం వేళల్లో వాతావరణం ఒక్కసారిగా మారి మోస్తరు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులు కూడా వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలో మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ క్రమంలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకూ.. ద్రోణి విస్తరించి ఉందని ఏపీ ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఏపీ విపత్తుల శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి, భారీ ఈదురుగాలులు వీచే ఛాన్సుందని, రైతులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసరంగా బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో రైతులు తమ పంటలను కాపాడుకునే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎండలు, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.
-
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV