
అమరావతి, 08 ఏప్రిల్ (హి.స.)
కాశీబుగ్గ, : ఆభరణాల దుకాణంలోకి వచ్చిన వ్యక్తులు వ్యాపారికి బేడీలు వేసి కిలో బంగారంతో ఉడాయించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు, పోలీసుల వివరాల ప్రకారం.. ‘పోలీసు’ అని రాసి ఉన్న టీ షర్టులు, మాస్కులు ధరించిన 8 మంది స్థానిక నిత్యానందనగర్లోని శ్రీవెంకటేశ్వర జ్యువెలర్స్లోకి ప్రవేశించారు. తుపాకీ చూపించి దుకాణ యజమాని కిల్లంశెట్టి రామకృష్ణారావును బెదిరించారు. ఆయన చేతులకు బేడీలు వేశారు. లాకర్ తాళం చెవులు తీసుకొని, అందులోని బంగారు ఆభరణాలతోపాటు వ్యాపారి మెడలో ఉన్న ఆభరణాలూ తీసుకొని పారిపోయారు. దుండగులు వెళ్లాక.. బాధితుడు బేడీలతోనే బయటికి వచ్చి సమీప దుకాణదారులకు దోపిడీ గురించి చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని బేడీల లింకు కట్ చేయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ