
కడప, 08 ఏప్రిల్ (హి.స.)వైఎస్సార్ కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుక్కల గుంపు దాడిలో ఓ చిరుత పులి కూన మృతి చెందింది. దువ్వూరు మండలం చిన్నబకరాపురం గ్రామ శివార్లలో ఈ సంఘటన వెలుగు చూసింది. తీవ్రమైన ఎండల కారణంగా అడవిలో నీటి వనరులు అడుగంటిపోవడంతో, దాహం తీర్చుకోవడానికి చిరుత కూన గ్రామంలోకి వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.
గ్రామ శివార్లలోని రైతు పుల్లారెడ్డి పొలంలో చిరుత కూన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
అనంతరం, చిరుత కూన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిర్వహించారు. చిరుత కూన మృతి చెందడంతో పొలాల్లో చిరుత పులుల సంచారం ఉందేమోనని రైతులు, పశువుల కాపరులు ఆందోళన చెందుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV