
ఏలూరు, 09 ఏప్రిల్ (హి.స.)మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హోం మంత్రి అనిత విరుచుకుపడ్డారు. ‘మావిగన్’ పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. గత వైపీపీ హయాంలో కనీసం ఒక ఫైర్ ఇంజన్ కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు. తప్పు చేసిన వారి విషయంలో చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామన్నారు. అవగాహన లేని వాళ్ళు గతంలో ఇష్టానుసారంగా వ్యవహరించి కోర్టుల నుంచి మొట్టికాయలు వేయించుకున్నారని తెలిపారు.
విజ్ఞత కలిగిన నాయకులు మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో అలాంటి తప్పులు చేయదలుచుకోలేదని హోం మంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏదైనా చట్ట ప్రకారం చేయడమే తప్ప ఎక్కడా ఉదాసీనతగా వ్యవహరించదని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఉన్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు.
ఈరోజు(బుధవారం) ఉదయం ఏలూరు చేరుకున్న హోం మంత్రికి ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి రాధాకృష్ణ, గన్ని వీరాంజనేయులు, రెడ్డి అప్పలనాయుడు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రూ.2 కోట్ల 72 లక్షలతో నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని అనిత ప్రారంభించారు. ఆపై పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్