
బాపట్ల, 09 ఏప్రిల్ (హి.స.)బాపట్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఈరోజు(గురువారం) ఉదయం భట్టిప్రోలు మండలం సూరేపల్లి చేరుకున్న సీఎం... అక్కడ ఏర్పాటు చేసిన గ్రామసభకు హాజరయ్యారు. ప్రభుత్వ స్టాళ్లను సందర్శించారు. ‘మీ భూమి - మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్య ప్రసాద్, పార్థసారథి, ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు తదితరులు పాల్గొన్నారు.
అమరావతి గెజిట్ వచ్చాక సీఎం మొదటి పర్యటనగా బాపట్లకు వచ్చారని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని తెలిపారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వేమూరు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని.. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆగిన అభివృద్ధి ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కిందన్నారు. సీఎం ఆలోచనల మేరకు ఉద్యాన పంటలు పెంచడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. మూత పడిన జంపని షుగర్ ఫ్యాక్టరీ స్థానంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలని.. ఈ ప్రాంతంలోని కాలువలు ఆధునీకరించాలని సీఎంను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కోరారు.
జగన్ హయాంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో భూములు లాక్కున్నారని మండిపడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ‘మీ భూమి - మీ హక్కు’ పేరిట రక్షణ కల్పించిందని ఎంపీ కృష్ణప్రసాద్ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్