
పోలవరం జిల్లా, 30 మే (హి.స.)
:రంపచోడవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నెల 27న రాజవొమ్మంగి మండలంలో తొమ్మిది పశువులపై పెద్దపులి దాడి చేసి చంపేసింది. ఈ ఘటన చుట్టుపక్కల గ్రామాల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ప్రస్తుతం గంగవరం మండలం వేములోవ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పశువులపై పులి దాడి గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను అప్రమత్తం చేశారు. దానిని బంధించాలని ఆదేశించారు.
ఈ మేరకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ట్రాకర్లను ఏర్పాటు చేసి వేములోవ పరిసర ప్రాంతాల్లో పెద్దపులిని గుర్తించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ డాక్టర్ జ్యోతి నేతృత్వంలో పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 14న పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టిన పెద్దపులి వెనక్కి వచ్చి పోలవరం జిల్లాలో సంచరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
L
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ