
హైదరాబాద్, 01 జూన్ (హి.స.)
అంతర్జాతీయ డ్రగ్స్ అక్రమ రవాణా పై
అధికారులు మరో భారీ పంజా విసిరారు. హాంకాంగ్ నుంచి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్)కు భారీ మొత్తంలో హైడ్రోపోనిక్ గంజాయి తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధికారుల వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన దీపక్ జోస్కుట్టి హాంకాంగ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించడంతో అతని సామానును క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో సుమారు 7 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ.7 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
విమానాశ్రయ భద్రతా సిబ్బంది, కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ డ్రగ్స్ రవాణా బయటపడింది. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను అధికారులు సీజ్ చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనికి ఈ డ్రగ్స్ ఎవరు అందించారు? హైదరాబాద్లో ఎవరికి సరఫరా చేయాలనుకున్నారు? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో విదేశాల నుంచి హైడ్రోపోనిక్ గంజాయి, సింథటిక్ డ్రగ్స్ అక్రమ రవాణా పెరుగుతున్న నేపథ్యంలో విమానాశ్రయాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో నగరంలో డ్రగ్స్ ముఠాల కార్యకలాపాలపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. డ్రగ్స్ అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..