గంజాయి గుట్టు రట్టు చేసేందుకు పోలీసుల స్పెషల్ ఆపరేషన్
కోదాడ, 01 జూన్ (హి.స.) గంజాయి సహా మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా కోదాడ పట్టణంలో పోలీసులు సోమవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది నార్కోటిక్ డాగ్ ''రోలెక్స్'' సహాయంతో పట్టణంలోని కీల
Police


కోదాడ, 01 జూన్ (హి.స.)

గంజాయి సహా మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా కోదాడ పట్టణంలో పోలీసులు సోమవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది నార్కోటిక్ డాగ్ 'రోలెక్స్' సహాయంతో పట్టణంలోని కీలక ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పట్టణ కేంద్రంలోని బస్టాండ్, హోటళ్లు, టీ దుకాణాలు, మెడికల్ షాపులు, కూరగాయల మార్కెట్లు, మద్యం దుకాణాలు, ప్రజలు అధికంగా సంచరించే బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక సోదాలు నిర్వహించారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల నిల్వలు, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించేందుకు నార్కోటిక్ 'రోలెక్స్'తో ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా డాగ్ పరిశీలించారు.

ఈ సందర్భంగా పట్టణ ఇన్స్పెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం గంజాయి వంటి మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును దెబ్బతీస్తూ సమాజానికి పెద్ద ముప్పుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గంజాయి వినియోగం, రవాణా, విక్రయాలు పూర్తిగా అరికట్టేందుకు పోలీసు శాఖ నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. గంజాయి నిర్మూలనలో ప్రజల సహకారం అత్యంత కీలకమని సీఐ తెలిపారు. ఎవరైనా గంజాయి వినియోగిస్తున్నా, విక్రయిస్తున్నా లేదా సరఫరా చేస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande