
అమరావతి, 01 జూన్ (హి.స.)
అరకులోయ, అరకులోయ ప్రాంతంలో వంటగ్యాస్ కోసం ప్రజలు అల్లాడుతున్నారు. డిమాండ్కు తగినట్లుగా సరఫరా చేయకపోవటంతోపాటు ఏజెన్సీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల పరిధిలో సుమారు 3500 వరకు భారత్ గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. నెల రోజులుగా సిలిండర్లు సక్రమంగా సరఫరా జరగక వారంతా ఇబ్బందులు పడుతున్నారు.
భారత్ వంట గ్యాస్నే మూడు మండలాల్లో అధిక శాతం మంది వినియోగిస్తున్నారు. ప్రతి నెలా 3500 వరకు సిలిండర్లు అవసరం ఉండగా.. 900 నుంచి 1000 వరకు మాత్రమే అరకులోయకు సరఫరా అవుతున్నాయి. డిమాండ్ అధికంగా ఉండటంతో సిలిండర్ల కోసం వినియోగదారులు బారులు తీరుతున్నారు. ఉదయం నుంచి క్యూలో ఉంటేనే సాయంత్రానికి సిలిండరు చేతికందే పరిస్థితి. పనులన్నీ మానుకుని సిలిండరు కోసం నిరీక్షించాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అరకులోయ ప్రాంతంలో, అనంతగిరి, పెదబయలు మండలాల్లో గతంలో భారత్ గ్యాస్ ఏజెన్సీలు గిరిజన సహకార సంస్థ ద్వారా సేవలు అందించేవి. రెండు నెలల నుంచి రెండు ఏజెన్సీలను అధికారులు నిలిపేశారు. ఆయా ఏజెన్సీల పరిధిలోని వినియోగదారులను వేరే ఏజెన్సీలకు బదిలీ చేశారు. దీంతో ఇబ్బందులు రెట్టింపు అయ్యాయి. దీనిపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మోహన్బాబు మాట్లాడుతూ వంటగ్యాస్ సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ