
హుస్నాబాద్, 01 జూన్ (హి.స.)
తెలంగాణ ప్రజల చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయంటూ గతంలో ఇక్కడి సమాజం పై విషం కక్కిన వ్యక్తి పవన్ కల్యాణ్. రాష్ట్రం వస్తే 11 రోజులు అన్నం తిననని ఏడ్చిన ఈ తెలంగాణ ద్వేషి.. ఇవాళ ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సభలు పెడతానంటే తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డ ఒప్పుకోడు. పవన్ కల్యాణ్ వెంటనే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాతే ఇక్కడ సభల గురించి ఆలోచించాలి అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం హుస్నాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు. గతంలో తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన పవన్.. ఇప్పుడు పూర్తిగా బీజేపీఎజెండాను మోస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో ఎలాగైనా విద్వేషాలు రెచ్చగొట్టి, ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేయాలనే కుట్రతోనే పవన్ కల్యాణ్ అడుగుపెడుతున్నారని పొన్నం ఆరోపించారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని, వారి డైరెక్షన్లోనే ఈ సరికొత్త నటన స్టార్ట్ చేశారని విమర్శించారు. బీజేపీ రెమ్యునరేషన్ ఇస్తే ఇక్కడికి రాలేదని కొండగట్టు అంజన్న మీద ప్రమాణం చేసి చెప్పే ధైర్యం పవన్కు ఉందా? అని సవాల్ విసిరారు. ఏపీ ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇస్తే.. అక్కడ ఉపముఖ్యమంత్రిగా చేయాల్సిన నవనిర్మాణం వదిలేసి, ఇక్కడ సభలు పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఈ నవనిర్మాణ సభలను బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్లో ఎందుకు పెట్టడం లేదని, కేవలం తన బాస్ మోదీని మెప్పించడానికే తెలంగాణను తాకట్టు పెట్టాలని చూస్తున్నారా? అని నిలదీశారు.
గాజులు పవన్ కల్యాణ్ వ్యవహార శైలిపై మంత్రి పొన్నం ప్రభాకర్ పదునైన సామెతలతో విరుచుకుపడ్డారు. కన్నతల్లికి కొనలేని వాడు... పిన తల్లికి ఒడ్డాణం చేయిస్తానన్నాడట! ఏపీలో కూట్లో రాయి (సొంత సమస్యలు) తీయలేని వాడు.. ఇక్కడికి వచ్చి ఏట్లో రాయి తీస్తాడా? అంటూ ఎద్దేవా చేశారు. ఏపీలో విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తుంటే కళ్ళు అప్పగించి చూశారని, కృష్ణపట్నం, గంగవరం పోర్టులను అదానీకి కట్టబెడుతుంటే ప్రశ్నించే చేతగానితనం పవన్ కల్యాణని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం, గ్యాస్, పెట్రోల్ ధరల పెంపుపై నోరు మెదపని పవన్.. సినిమాల్లో కాకుండా నిజ జీవితంలో దేశభక్తి చూపించాలని హితవు పలికారు.
హీరోగా పవన్ కల్యాణ్ను అభిమానిస్తాం, ఆదరిస్తాం. ఆయన అభిమానులు సినిమాలు చూసుకోండి.. కానీ రాజకీయ నాయకుడిగా తెలంగాణ అస్తిత్వం పై దాడి చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. రేపు (జూన్ 2న) జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎవరైనా పాల్గొనవచ్చు, పొరుగు రాష్ట్రంగా ఏపీపై మాకు ప్రేమ ఉంటుంది. కానీ ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టి జనాలు తన్నుకు చావాలనేదే మీ పవనిజమా? యువతను కేవలం జై కొట్టడానికే పరిమితం చేయకుండా, నిరుద్యోగులైన మీ ఫ్యాన్స్కు కేంద్రం ద్వారా ఉద్యోగాలు ఇప్పించండి అని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..