
పాడేరు పట్టణం, 30 మే (హి.స.)
, : మన్యం సిగలో మరో మణిహారం మెరవనుంది. జిల్లాలో ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య కళాశాల, జాతీయ రహదారితోపాటు ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ ఖరగ్పూర్ - అమరావతి హైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఈ కారిడార్ పశ్చిమ బెంగాల్తోపాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కలుపుతూ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. దీనికి సంబంధించి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ రాష్ట్రానికి సూచించిన రెండో ఆప్షన్ ఎలైన్మెంట్కు రాష్ట్రం ఇప్పటికే సమ్మతి తెలిపింది.
హైస్పీడ్ కారిడార్ పొడవు 1,057 కిలోమీటర్లు. రాష్ట్రంలో 457 కి.మీ., అల్లూరి జిల్లాలో అరకులోయ, పాడేరు, చింతపల్లి మీదుగా 202 కి.మీ. దూరం ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రూ.1,550 కోట్లతో ఐదేళ్ల కిందట హైవే నిర్మాణం ప్రారంభమైంది. రాజమహేంద్రవరం నుంచి చింతపల్లి, లంబసింగి, పాడేరు, అరకులోయను కలుపుతూ నిర్మిస్తున్నారు. ఖరగ్పూర్ - అమరావతి హైస్పీడ్ రోడ్డు కారిడార్ ఏర్పాటుతో పర్యాటక, ఉద్యోగ, ఉపాధి రంగాలు మరింత వృద్ధి చెందుతాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ