
సిద్దిపేట, 30 మే (హి.స.)
రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల నిర్వహణ గురించి శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. సిద్దిపేట ఆర్డీవో మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు. స్టేజ్ డెకరేషన్, గ్రౌండ్ ముస్తాబు రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ప్రతిబింబించేలా రూపొందించాలని అన్నారు.
గ్రామీణ అభివృద్ధి శాఖ, గృహ నిర్మాణం, వ్యవసాయం, హార్టికల్చర్, పౌరసరఫరాలు, సోలార్ పవర్, జనగణన 2027, ప్రత్యేక ఓటర్ నమోదు, మరియు ఇతర అన్ని శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని వివరించేలా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమ ముఖ్య అతిథి ప్రసంగ ప్రతులను సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు తాగునీరు, సీటింగ్ ప్రాబ్లం లేకుండా చూడాలన్నారు. ఎండలు అధికంగా ఉన్నందున అవసరమైన మందులతో మెడికల్ సిబ్బంది సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, డీఆర్ నాగరాజమ్మ, ఆర్డీఓ సదానందం, కలెక్టరేట్ ఏవో రాజ్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారుల తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..