
హైదరాబాద్, 30 మే (హి.స.)
తెలంగాణలోని రాష్ట్ర, జిల్లా స్థాయి
జర్నలిస్టులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రస్తుతం ఉన్న జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు, బస్ పాస్ల చెల్లుబాటు గడువును మరోసారి పొడిగిస్తూ సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి మే 31, 2026 నాటికి ముగియనున్న బస్ పాస్ల గడువును.. ఇప్పుడు జూన్ 16, 2026 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ 2. ముకుంద రెడ్డి, టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) మేనేజింగ్ డైరెక్టర్కు అధికారిక లేఖ రాశారు.
అక్రిడిటేషన్ కార్డుల గడువు కూడా జూన్ 16 వరకు పొడిగించినందున, వాటి వ్యాలిడిటీతో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ ప్రస్తుతం ఉన్న బస్ పాస్ల గడువును జూన్ 16 వరకు పొడిగించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణానికి అనుమతించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది జర్నలిస్టులకు పెద్ద ఊరట లభించినట్లయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..