
కొండాపురం , 31 మే (హి.స.)
ఒకప్పుడు ఫ్యాక్షన్ గడ్డగా ముద్రపడిన రాయలసీమ ఇప్పుడు ఫ్యూచర్ ఎనర్జీ కి కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. పునరుత్పాదక ఇంధన రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్గా ఎదుగుతున్న ఎస్ఏఈఎల్ సంస్థ కడప జిల్లాలో 2 వేల 400 కోట్ల పెట్టుబడితో సోలార్ ప్లాంట్లను నిర్మించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఇటివల మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు.
కొండాపురం మండలం టి.కోడూరు, సరిహద్దులోని అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బొడాయిపల్లి పరిధిలో 12 వందల కోట్లతో 300 మెగావాట్ల ప్రాజెక్టును నిర్మించింది. జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలం దిగువ కలువట్ల, నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లె పరిసరాల్లో కలిపి మరో 300 మెగావాట్ల ప్రాజెక్టును 12 వందల కోట్లతో ఏర్పాటు చేసింది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా సుమారు 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఇందుకు రైతుల నుంచి రెండు చోట్లా 15 వందల 42 ఎకరాల భూములను 30 ఏళ్ల కాలపరిమితికి ఎస్ఏఈఎల్ సంస్థ లీజుకు తీసుకుంది. ఏడాదికి ఎకరానికి 31 వేల లీజు చొప్పున రైతులకు చెల్లిస్తూ ప్రతి రెండేళ్లకోసారి 5 శాతం పెంచేలా ఒప్పందం చేసుకుంది. దీని వల్ల రైతులకు శాశ్వత ఆదాయ మార్గం లభించినట్లైంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ప్రాజెక్టు రాబోయే 25 ఏళ్లలో దాదాపు 2 కోట్ల 16 లక్షల టన్నుల కార్బన్ డయాక్త్సెడ్ ఉద్గారాలను తగ్గించనుంది. ఈ రెండు ప్లాంట్లలో అత్యాధునిక బైఫేషియల్ సోలార్ సాంకేతికతను ఉపయోగించారు.
అదే విధంగా రాబోయే పదేళ్లలో 10 లక్షల కోట్ల హరిత ఇంధన పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీని భారతదేశపు క్లీన్ ఎనర్జీ రాజధానిగా మార్చేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV