
హైదరాబాద్, 21 జూన్ (హి.స.)
రాష్ట్రంలో సైబర్ నేరాల బాధితులకు ఇప్పటి వరకు రూ.45.21 కోట్లు రిఫండ్ చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆదివారం వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 20వ తేదీ వరకు ఈ నగదు మొత్తాన్ని రిఫండ్ చేసినట్లు వివరించింది. సైబర్ నేరాల ఫిర్యాదుల ఆధారంగా 6,303 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు పేర్కొంది. ఫ్రీజ్ చేసిన ఈ మొత్తం విలువ రూ.45.21 కోట్లు అని స్పష్టం చేసింది. టీజీసీఎస్బీ ద్వారా 77 కేసుల్లో రూ.6.83 కోట్లు రికవరీ చేసినట్లు తెలిపింది.
నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో.. హైదరాబాద్లో 779 కేసుల్లో రూ.4.04 కోట్లు, సైబరాబాద్లో 755 కేసుల్లో రూ.3.22 కోట్లు, రాచకొండలో 167 కేసుల్లో రూ.1.69 కోట్లు రిఫండ్ చేసినట్లు గణాంకాలతో సహా టీజీసీఎస్బీ వివరించింది. తెలంగాణ సైబర్ నేర నెట్వర్క్ పోర్టల్ ద్వారా మొత్తం 59,953 కేసుల్లో రూ.445.41 కోట్లు ఫ్రీజ్ చేసినట్లు వివరించింది. అపరిచిత లింకులు, ఓటీపీ(OTP)లు, పిన్ (PIN)లు, పాస్వర్డ్స్ ఎవరితోనూ పంచుకోవద్దని ప్రజలకు టీజీసీఎస్బీ స్పష్టం చేసింది. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ )లో ఫిర్యాదు చేయాలని బాధితులకు టీజీసీఎస్బీ సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్