
అమరావతి, 21 జూన్ (హి.స.)
హైదరాబాద్, :ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి( బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు(ఈరోజు (ఆదివారం) బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. నెరవేరని కాంగ్రెస్ గ్యారంటీలపై వినతిపత్రం సమర్పించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు. ఒకవేళ కాంగ్రెస్ నాయకత్వం స్పందించడంలో, అపాయింట్మెంట్ కల్పించడంలో విఫలమైతే, అది కాంగ్రెస్ తెలంగాణకు, ఇక్కడి ప్రజలకు చేసిన తీవ్ర ద్రోహమని పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు, గ్యారంటీల ఆధారంగానే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్పై నమ్మకం ఉంచారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతునప్పటికీ మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత, వృద్ధులు, వ్యవసాయ కార్మికులు, పేద కుటుంబాలకు ఇచ్చిన పలు కీలక హామీలని ఇంకా ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.
మహిళలు నెలకు రూ.2,500 అందుతుందని ఆశించిన ఆర్థిక సహాయం కోసం ఇంకా ఎదురుచూస్తున్నారని రాంచందర్ రావు చెప్పుకొచ్చారు. అలాగే రైతుభరోసా కింద ఎకరాకు రూ.15,000 వస్తుందని అన్నదాతలు ఇంకా వేచి చూస్తున్నారని పేర్కొన్నారు. కౌలు రైతులు, రైతు కూలీలు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు కూడా నిరాశే ఎదురవుతోందని తెలిపారు. విద్యార్థులు, యువత పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, విద్యాభరోసా పథకం కింద ఇస్తామన్న రూ.5 లక్షల సహాయం ఇంకా ఎందుకు కార్యరూపం దాల్చలేదని నిలదీశారు. విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ పదేపదే నిరుద్యోగులకు హామీ ఇచ్చిన నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి కోసం ఇంకా ఎదురుచూస్తున్నారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ