
ములుగు, 21 జూన్ (హి.స.) ప్రతిరోజు ప్రతి ఒక్కరు యోగా చేయడం ద్వారా పలు రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చని మంత్రి సీతక్క అన్నారు. ప్రతి వ్యక్తి ఉదయం లేవగానే సెల్ ఫోన్ల వాడకాన్ని దూరం చేసుకుని యోగ, వ్యాయామం చేయాలని సూచించారు. ఆదివారం(జూన్ 21) 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం - 2026 పురస్కరించుకొని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల ప్రాంగణంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించగా, మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేక, డీఎఫ్వో వికాస్ మీనా తో కలసి యోగా ఆసనాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణతో కూడిన జీవన విధానమని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు. యోగ కార్యక్రమం ప్రాచీన కాలం నుండే కొనసాగుతున్నదని, నేడు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిందని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఆస్తి ఎంత ముఖ్యమో ఆరోగ్యం అంత ముఖ్యమని, సంపాదనే ధ్యేయంగా కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం, యోగా కార్యక్రమాలు చేయాలనే అన్నారు. గడిచిన కాలంలో అప్పటి సాంప్రదాయాలను పాటించడం వలన అప్పటి మనుషులు ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నారని, నేటి హైటెక్ యుగంలో పాత సాంప్రదాయాలను వదిలివేయడం వలన అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాతకాలం నాటి సంప్రదాయాలు బంగారంతో సమానమని, తాను సైతం 2006 నుండి యోగ ఆసనాలు వేయడం ప్రారంభించామని వివరించారు. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపద యోగ అని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడానికి మంచి ఏర్పాట్లు చేశారని కొనియాడుతూ ప్రతి వ్యక్తి యోగతో పాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల ఆరోగ్యకరంగా ఉండటానికి దోహదపడతాయని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు