
తిరుపతి, 21 జూన్ (హి.స.): ప్రతిరోజూ యోగాభ్యాసాన్ని దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసం, అంతరంగ ప్రశాంతతను పొందవచ్చని టిటిడి ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర పేర్కొన్నారు.12వ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా టిటిడి పరిపాలనా భవనం వెనుకనున్న పరేడ్ మైదానంలో ఈ రోజు ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించిన యోగ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శ్రీవారి సేవలో నిత్యం నిమగ్నమై లక్షలాది మంది భక్తులకు సేవలందిస్తున్న టిటిడి ఉద్యోగులు యోగను అలవర్చుకుంటే ఆరోగ్యవంతమైన, ఆనందమయమైన జీవితం గడపగలరని తెలిపారు. గత 14 రోజులుగా క్రమశిక్షణతో యోగ సాధన చేసిన ఉద్యోగులు, సిబ్బందిని ఈవో ప్రత్యేకంగా అభినందించారు.తాను కూడా ఒకప్పుడు బలవంతంగా యోగ ప్రారంభించినప్పటికీ, అది క్రమంగా అలవాటై ఆరోగ్యకరమైన జీవనశైలికి దారి తీసిందని తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా టిటిడి జేఈవో డా.ఎ.శరత్ మాట్లాడుతూ,గతంలో యోగ దినోత్సవాన్ని ఒకరోజు మాత్రమే నిర్వహించేవారని, ఈసారి ఈవో ఆదేశాల మేరకు జూన్ 7 నుంచి 21 వరకు 14 రోజుల పాటు టిటిడి సంస్థల్లో విస్తృత స్థాయిలో యోగ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఉద్యోగులందరూ యోగను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో భాగంగా “ధ్యాన మూలమిదం జగత్”, “యోగ – ఒక పరిచయం” సీడీలు, పుస్తకాలను ఈవో ఆవిష్కరించారు. అలాగే స్విమ్స్ రూపొందించిన యోగ అవగాహన బ్రోచర్ను విడుదల చేశారు. కార్యక్రమానికి ముందు పూజా కార్యక్రమాలు, జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు.
ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన యోగాసనాలను అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు సమిష్టిగా అభ్యసించారు. గత 14 రోజుల యోగ శిక్షణలో ప్రతిభ కనబరిచిన అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులకు ఈవో ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యుడు శ్రీ నన్నపనేని సదాశివరావు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఇన్చార్జి కార్యదర్శి డా. మేడసాని మోహన్, సీవీఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, స్విమ్స్ డైరెక్టర్ డా. ఆర్వీ కుమార్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV