
హైదరాబాద్, 22 జూన్ (హి.స.)
బాలాపూర్, నిల్వ ఉన్న రసాయన డబ్బా పేలి ఒకరు మృతి చెందిన ఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఏసీపీ ప్రదీప్కుమార్రెడ్డి కథనం ప్రకారం... పశ్చిమ బెంగాల్లోని ఈస్ట్ మిడ్నాపూర్ కజిచక్ ప్రాంతానికి చెందిన అనూప్ ప్రధాన్(43) రంగారెడ్డి జిల్లా బాలాపూర్ రెవెన్యూ పరిధిలోని ఓ గోదాములో పనిచేసేందుకు మూడు రోజుల క్రితం వచ్చాడు. డెకరేషన్ ఐటం తయారు చేసేందుకు 10 ఏళ్ల క్రితం తెప్పించిన మిథైల్ ఈథైల్ కీటోన్ పెరాక్సైడ్తో కూడిన రసాయన డబ్బాను ఆదివారం మధ్యాహ్నం అక్కడే ఉండే కొందరు వికెట్ల మాదిరిగా ఉపయోగించి క్రికెట్ ఆడారు. ఆ తర్వాత పక్కన పెట్టి వెళ్లిపోయారు. సాయంత్రం అనూప్ ప్రధాన్ డబ్బాను పక్కకు పెట్టే క్రమంలో ఊపడంతో ఒక్కసారిగా పేలింది. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో పాటు అతని శరీర భాగాలు ఎగిరిపడ్డాయి. రెండు కాళ్లు ఛిద్రమయ్యాయి. ఒక కాలి భాగం 50 మీటర్ల దూరంలో పడింది. రసాయన పదార్థం వల్లే పేలుడు జరిగిందని నిపుణులు నిర్ధారించినట్లు ఏసీపీ తెలిపారు. డీసీపీ రాజేష్, ఇంటెలిజెన్స్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పేలుడు ఘటనకు సుమారు కిలోమీటర్ వరకు ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్