
బాపట్ల, , 22 జూన్ (హి.స.)
సర్కార్ ఎక్స్ప్రెస్లో బాపట్ల- అప్పికట్ల మధ్య ఈ నెల 15న వేకువజామున జరిగిన దోపిడీ కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన భవారియా గ్యాంగ్ ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు. దోపిడీలో మొత్తం ఆరుగురు పాల్గొనగా.. ఓ నిందితుడైన రాజస్థాన్ రాష్ట్రం హనుమాన్గఢ్ జిల్లా టిబ్బి తాలూకా తల్వారాజీల్ గ్రామానికి చెందిన సోనూను అరెస్టు చేసినట్లు రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారన్నారు. స్థానిక జీఆర్పీ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన భవారియా గ్యాంగ్ సభ్యులైన సోను, రాజ్వీర్, లక్కన్, సీతారాం, వినోద్, మిథున్లు చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టు వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్లో ఈ నెల 14న రాత్రి ఎక్కారు. రైలు బాపట్ల శివారులో ఉండగా.. ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడలో నుంచి 75 గ్రాముల బంగారు గొలుసులను బలవంతంగా లాక్కున్నారు.
పోలీసులు పది రౌండ్ల కాల్పులు జరిపారు. దొంగలు తప్పించుకుని పారిపోయారు. బాధిత మహిళా ప్రయాణికుల ఫిర్యాదులు స్వీకరించి.. దోపిడీకి పాల్పడ్డ నిందితులపై తెనాలి జీఆర్పీ ఇన్ఛార్జి ఎస్సై సరస్వతి కేసు నమోదు చేశారు. దొంగలను పట్టుకోవడానికి డీఎస్పీ అక్కేశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వారు నిందితుల్లో ఒకరైన సోనూను ఆదివారం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మిగిలిన ఐదుగురు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. రైలు దోపిడీ కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేసిన జీఆర్పీ అధికారులు, సిబ్బందిని రైల్వే డీఐజీ బి.సత్యయేసుబాబు అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ