
హైదరాబాద్, 22 జూన్ (హి.స.)ఇంటర్ పాసయ్యాడు. ఇచ్చిన మాట ప్రకారం బైక్ కొనిద్దాం.. పిల్లాడు పది గట్టెక్కాడు, ఎలక్ట్రిక్ బైకే కదా.. ఇచ్చేద్దాం.. చాలా మంది తల్లిదండ్రుల ధోరణి ఇదే. నగర ప్రజా రవాణా సాధనాల్లో విద్యార్థులను పంపలేని, ప్రైవేటు కళాశాలల రవాణా ఫీజు భరించలేని తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తున్నారు. ఒక్క బైక్ కొంటే దానిపై అబ్బాయి లేదా అమ్మాయి కళాశాలకు వెళ్లొచ్చు.. ఇంటివద్ద కూడా పనికొస్తుందనుకుంటారు. ‘అబ్బాయికి 18 ఏళ్లు నిండాయా లేదా?’ అనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందా.. లేదా అనే విషయంతో సంబంధం లేకుండా వాహనాలు వారి చేతికిస్తున్నారు. సాధారణంగా ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు 17 ఏళ్లు పూర్తవుతాయి. 18 ఏళ్లు నిండితేనే లెర్నర్స్ లైసెన్స్కు అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవేవీ పట్టించుకోకుండానే చాలా మంది విద్యార్థులు ద్విచక్ర వాహనంపై చక్కర్లు కొడుతున్నారు. కొందరు ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో దొరికిపోయి కౌన్సెలింగ్ కోసం తల్లిదండ్రులను ఠాణా మెట్లెక్కిస్తున్నారు.
మల్కాజిగిరి జోన్ పరిధిలో ఈ నెలలో ఒక్కరోజు తనిఖీల్లోనే మైనర్ల డ్రైవింగ్, లైసెన్స్ లేనివారు, సరైన పత్రాలు లేనివారు, ట్రిపుల్ రైడింగ్ వంటి ఘటనల్లో సుమారు 1,500 కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు
కళాశాలలన్నీ దాదాపుగా నగర శివారులో ఉన్నాయి. నగర ట్రాఫిక్ నుంచి బయటపడి కళాశాలలకు వెళ్లిన కుర్రాళ్లకు అక్కడి ఖాళీ, విశాల రోడ్లను చూడగానే ఉత్సాహం తన్నుకొస్తది. పైగా స్నేహితులు వెంట ఉండేసరికి పట్టపగ్గాలుండట్లేదు. రేసింగ్, ట్రిపుల్ రైడింగ్లు, స్టంట్లు చేస్తూ ప్రమాదాలకు గురవటమో, కారణం కావటమో జరుగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్