
హైదరాబాద్, 22 జూన్ (హి.స.)
రాజధాని నగరంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ పథకం కింద ఇచ్చే ఇళ్లకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం జీప్లస్ 9 అంతస్తుల భవనాల్లో రెండు పడకగదుల ఇళ్లు నిర్మించి ఇవ్వనుంది. జులై తొలివారంలో నిర్మాణ పనులను ప్రారంభించి వచ్చే ఏడాది జూన్లోపు లబ్ధిదారులకు అందజేయనుంది. ఇందుకోసం పాతబస్తీ సహా నగరంలోని పలు ప్రాంతాల్లో గృహనిర్మాణ శాఖ అధికారులు ఏడు ప్రాంతాలను గుర్తించారు. ఎకరం విస్తీర్ణంలో 150 ఫ్లాట్లు నిర్మించేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేశారు. రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.. మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అజారుద్దీన్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్తో కలిసి ఇటీవల పాతబస్తీలో పర్యటించారు. అక్కడ పేదలకు సాధ్యమైనంత వేగంగా ఇళ్లు నిర్మించాలని ఎంపీ కోరారు. దీంతో జులై తొలివారంలో ప్రభుత్వ స్థలాలను తీసుకుని అందులో నిర్మాణాలుంటే కూల్చేసి కొత్తగా నిర్మాణాలను చేపట్టనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్